కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. ఇవాళ ఉదయానికి ఆ సంఖ్య 308కు చేరింది. వారిలో 25 మంది పిల్లలు, 70 మంది మహిళలు ఉన్నారు. మరో 213 మందికిపైగా గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో ఇంకా 206 మంది జాడ తెలియడం లేదు.
మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, నేవీ, NDRF, ఇతర సహాయ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించాయి. తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసి రెస్కూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది బురదలో చిక్కుకుపోయారని.. వారిని గుర్తించేందుకు ట్రైన్డ్ జాగిలాలను రంగంలోకి దింపినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యులు.. తాము చేయలేమంటూ చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు మొత్తం ఛిద్రిపోయి.. దారుణ పరిస్థితుల్లో ఉన్నాయని.. అలాంటి పరిస్థితులను తామెప్పుడూ ఎదుర్కోలేదని.. కానీ ఇప్పుడు తప్పడం లేదంటూ వాపోతున్నారు. వయనాడ్లో ఇంతటి విలయాన్ని ఎన్నడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.