చత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అబూజ్ మడ్ అడవి ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. దంతేవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దంతేవాడ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నేడు ఆపరేషన్ జరిగింది. అబూజ్ మడ్ అడవి ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. బస్తర్ పరిధిలో నాలుగు జిల్లాల భద్రత బలగాలు కూంబింగ్ కి వెళ్ళగా.. వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.
ప్రతిగా భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు. ఉదయం 3 గంటల నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ పోలీసులు వెల్లడించారు. ఈ కూంబింగ్ లో నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగాల్ జిల్లా భద్రత బలగాలతో పాటు డిఆర్జి, ఎస్టిఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.