దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ దిల్లీ, హరియాణాల్లో లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. దిల్లీలో నాలుగు, హరియాణాలో ఒక అభ్యర్థిని ప్రకటించిన ఆప్ పార్టీ సీనియర్ నేత సోమ్‌నాథ్ భారతిని న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. కొండ్లి ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్‌ను దిల్లీ తూర్పు, సహిరామ్ పహిల్వాన్‌ను దిల్లీ దక్షిణం, మాజీ ఎంపీ మహాబల్ మిష్రాను పశ్చిమ దిల్లీ లోక్‌సభ స్థానాల నుంచి పోటీలో నిలిపింది.
దిల్లీలో ఇండియా కూటమితో కలిసి ఆప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ మూడు, ఆప్ 4 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. అటు.. హరియాణాలోని కురుక్షేత్ర స్థానానికిగానూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుషిల్ గుప్తా పేరును ప్రకటించింది. గుజరాత్‌లో 2, అసోంలో 3 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోక్సభ ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దిల్లీ, పంజాబ్ గుజరాత్, గోవా, హరియాణాలో ఎలాగైనా సీట్లు గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.