దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేయబోమని ఆమె స్పష్టం చేశారు. ఒక వేళ చేయాల్సి వస్తే బ్యాంకు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. బ్యాంకులు దేశ ఆశయాలను ప్రతిబింబించాలని అన్నారు.
కాగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న రెండు రోజుల సమ్మెలో దేశంలోని మొత్తం 9 బ్యాంకు ఉద్యోగ సంఘాల ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బ్యాంకులను ప్రైవేటు పరం చేయాల్సి వస్తే ఉద్యోగులకు అన్ని విధాలుగా భద్రతను అందిస్తామని తెలిపారు.
కాగా శని, ఆదివారాలు సెలవు రోజులు కావడం, సోమ, మంగళవారాల్లో వరుసగా ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ఏటీఎం సేవలు పనిచేస్తున్నా.. బ్యాంకుల్లో లభించే సేవలు మాత్రం అందుబాటులో లేవు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ వంటి బ్యాంకులు మాత్రం యథావిధిగానే పనిచేస్తున్నాయి.