సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా సిద్ధమైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అమెజాన్ ప్రైమ్ డే (Amazon Prime Day)సేల్ నిర్వహించనుంది. జూలై 26, 27 తేదీల్లో ఈ సేల్ నిర్వహించాలని అమెజాన్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఈ సేల్ జూలై 25న అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమై… జూలై 27 అర్ధరాత్రి 12 గంటలకు ముగియనుంది.
ప్రైమ్ డే సేల్ సందర్భంగా కొత్తగా 300 ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు తెల్సింది. ఇక ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి. అలానే బ్యాంక్ కార్డులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అలానే అమెజాన్ పేతో కొనుగోలుపై రూ.1000, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ఐదు శాతం వరకు రివార్డు పాయింట్లు లభిస్తాయి.
వాస్తవానికి అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూన్‌లో జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సేల్ ఆలస్యమైనట్లు అమెజాన్ తెలిపింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా ఘోరంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, తయారీదారులకు చేయూతనిచ్చేందుకు ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.