భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తీసుకొచ్చేందుకు ఓవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోవైపు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇద్దరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఇద్దరు కుబేరుల్లో ఈ అవకాశం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం తర్వాత భారత్‌లో స్టార్‌లింక్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు మస్క్ ప్రకటించారు. ఇంటర్నెట్ లేని లేదా అధిక వేగం సేవలకు దూరంగా ఉన్న గ్రామాలకు ఈ సేవలకు అద్భుతంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడే ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురవుతోంది.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు వేలం నిర్వహించరాదని స్టార్‌లింక్ లాబీయింగ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా లైసెన్సులు కేటాయిస్తున్న విధానాన్నే అనుసరించాలని కోరుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. శాటిలైట్ స్పెక్ట్రమ్‌కు వేలం నిర్వహించాలని పట్టుబడుతోంది. విదేశీ కంపెనీల డిమాండ్‌లకు అంగీకరించకుండా వేలం నిర్వహించమని భారత ప్రభుత్వంపై రిలయన్స్ ఒత్తిడి తీసుకురావొచ్చని అంటున్నారు.