కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) త్వరలో అమలు చేయబోతోందనే ఊహాగానాలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఇక తాజాగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కార్ల నంబర్ ప్లేట్లు సోషల్ మీడియాలో వైరల్ కావండతో ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.
ఇటీవల దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరైన ఈ ఇద్దరు మంత్రుల కార్ల నంబరుప్లేట్లపై అంకెల మధ్యలో ‘సీఏఏ’ అని ఉండటం కలకలం రేపుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని సత్వరం అమలు చేయనున్నట్లు సంకేతాలు ఇస్తోందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
2019లోనే రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందే అమలులోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్ నంబర్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.