బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక విపక్షాలు ‘ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నాయని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలకు ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఈశాన్యం నుంచి దక్షిణం వరకు ప్రతిపక్షాలు ఎన్ని గందరగోళాలు, వదంతులు, ఫేక్ వీడియోస్ వైరల్ చేసినా.. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘దేశవ్యాప్తంగా బీజేపీ వేవ్ ఉంది. ప్రజలంతా మళ్లీ మోదీ రావాలని కోరుకుంటున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఘోర పరాభవం తప్పదు. ఆ విషయం వారికి తెలుసు. అందుకే ఫేక్ వీడియోలను వైరల్ చేయడం వంటి చీప్ పనులకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీవ్రంగా కృషి చేసింది. దాని ఫలితంగానే అసోం ప్రజలు నేడు వీధుల్లో తిరగగలుగుతున్నారు.’ అని అమిత్ షా అన్నారు.