ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ముంబయిలోని అంబానీ నివాసంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం జులై 3వ తేదీన (బుధవారం) ‘మామెరు’ వేడుకను వైభవంగా నిర్వహించారు. వరుడు అనంత్ అంబానీ, వధువు రాధికా మర్చంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లికి కొద్దిరోజుల ముందు మామెరు వేడుక నిర్వహించడం గుజరాతీల సంప్రదాయం.
అనంత్ అంబానీ తల్లి అయిన నీతా అంబానీ పుట్టింటి వారు ‘మామెరు’ వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ వరుడి ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. రాధికా మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు. ఈ వేడుక కోసం అంబానీల నివాస భవనం యాంటిలియాను రంగరంగుల పూలు, విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.