దేశంలో చీతాలు అంతరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ టైగర్ అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలు దిగుమతి చేసుకుంది. వాటిని మధ్య ప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో ఉంచింది. ఈ చీతాల గుంపులో తాజాగా మరొకటి మరణించింది. ‘ఉదయ్’ అనే 6 సంవత్సరాల వయసున్న మగ చీతా ఆదివారం చనిపోయిందని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు.
మరణించిన చీతా అస్వస్థతకు గురైందని.. చికిత్స పొందుతూ మృతి చెందిందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధ్రువీకరించారు. చీతా మరణానికి గల కారణం ఇంకా తెలియలేదని అన్నారు. అంతకుముందు మార్చి 27న కూడా నమీబీయా నుంచి తీసుకొచ్చిన సాషా అనే చీతా కిడ్నీ వ్యాధి కారణంగా ఇదే పార్క్లో ప్రాణాలు విడిచింది. కాగా, నెల రోజుల వ్యవధిలోనే మరో చీతా మరణించడం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇప్పటివరకు 20 చీతాలను దిగుమతి చేసుకుంది.