దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. ఇక ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అదుపులోకి తీసుకుంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావడం గమనార్హం. ఈ క్రమంలో సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్టైన వారి జాబితాను పరిశీలిస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత మొదలు ఓం ప్రకాశ్ చౌతాలా (హర్యానా), మధు కోడా (ఝార్ఖండ్), హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్) వంటి నేతలు ఉన్నారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈడీ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.