అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. నేటితో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు ముగియనుంది. దీంతో ముందుగానే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60, సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్ 19వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరిగింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. సిక్కింలో అధికారంలో బీజేపీ, సిక్కిం క్రాంతికారి మోర్చా కూటమి అధికారంలో ఉంది. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మరోవైపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలు జూన్4వ తేదీన వెలువడనున్నాయి.
ఇంకోవైపు తెలంగాణలో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.