గతేడాది 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాల్లో జోరుగా సాగినట్లు ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. విక్రయాల్లో ఏకంగా రెండంకెల వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ప్రయాణికుల, త్రిచక్ర వాహనాలు సహా ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని పేర్కొంది. అన్ని విభాగాల్లో కలిపి 2023- 24లో 2,45,30,334 యూనిట్ల వాహనాలు అమ్ముడైనట్లు వివరించింది.
2022-2023లో నమోదైన 2,22,41,361 వాహనాలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్రయాణికుల వాహన విక్రయాలు ఎనిమిది శాతం వృద్ధితో 39,48,143 యూనిట్లకు చేరాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు అందుకు దోహదం చేసినట్లు చెప్పారు. ఇక త్రీ టైర్ వాహన విక్రయాలు 49 శాతం పెరిగి 11,65,699 యూనిట్లకు చేరాయని వెల్లడించారు. అందుబాటు ధరలో సీఎన్‌జీ వాహనాలు, విద్యుత్తు మోడళ్లు, నాణ్యమైన సర్వీసు వంటి అంశాలు ఈ విభాగంలో విక్రయాలకు ఊతమిచ్చినట్లు సింఘానియా పేర్కొన్నారు. మరోవైపు ట్రాక్టర్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8,29,639 యూనిట్ల నుంచి 9 శాతం పెరిగి 8,92,313 యూనిట్లకు చేరినట్లు వివరించారు.