ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఓ కీలక ప్రకటన చేసింది. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేనందునే ఇలా కోరుతున్నామని ప్రకటనలో వివరించింది.
స్థానిక అధికార యంత్రాంగం కూడా ప్రొటోకాల్ పాటించే పరిస్థితిలేదని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. జనవరి 26వ తేదీ తరవాత దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులను అయోధ్యకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అందరూ అయోధ్య రామయ్యకు పూజలు చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను దక్షిణ భారత యాత్రికులు పరిగణనలోకి తీసుకోవాలని సూచనలు జారీ చేసింది ట్రస్ట్. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులను వివిధ సమయాల్లో ఆహ్వానించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వీటికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటుందని చంపత్ రాయ్ వెల్లడించారు.