రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కీలక ప్రకటన చేశారు. 2024 జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావొద్దని విజ్ఞప్తి చేశారు. అయోధ్యకు వచ్చే బదులు భక్తులు తమ సమీపంలోని రామ మందిరాల్లోనే ప్రత్యేక పూజలు చేయాలని కోరారు. రద్దీని నివారించడం కోసమే తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు వచ్చే భక్తుల కోసం సాధారణ భోజనం, నిద్రించడానికి స్థలం, విడిది కేంద్రాల వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని రాయ్ వెల్లడించారు. భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు రైల్వేశాఖ వర్గాలు ప్రకటించాయి.
రామ్ లల్లా పవిత్ర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్య ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. నగరంలో స్థిరాస్తి ధరలు గణనీయంగా పెరిగాయి. వ్యాపారులు, హోటళ్ల యజమానులు, పెట్టుబడిదారులు అయోధ్య కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి.