ప్రస్తుతం ప్రతి దేశాన్ని కలవరపెడుతున్న సమస్యలో ప్రధానమైంది ట్రాఫిక్ జామ్. కొన్ని ప్రాంతాల్లో గంటలు దాటినా కనీసం కిలోమీటరు దూరాన్ని కూడా దాటలేని దుస్థితి ఉంది. గతేడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ గల నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ నిలిచినట్లు టామ్ టామ్ ట్రాఫిక్ సూచీ -2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకుపైగా పడుతున్నట్లు తెలిపింది. ఇక ఆ తర్వాత రెండో స్థానంలో డబ్లిన్ (ఐర్లాండ్), మూడో స్థానంలో టొరంటో (కెనడా)లు నిలిచాయి.
55 దేశాల్లోని 387 నగరాల్లో 60 కోట్లకుపైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల సమాచారం ఆధారంగా టామ్ టామ్ ట్రాఫిక్ సూచీ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఇక టాప్-10 జాబితాలో భారత్‌లోని బెంగళూరు సిటీ ఆరో స్థానంలో (6), పుణె (7)లు ఉన్నాయి. గతేడాది బెంగళూరులో 10 కి.మీల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టినట్లు నివేదికలో వెల్లడైంది. రద్దీ కారణంగా ఇక్కడి వాహనదారులు ఏడాదిలో 132 గంటలు కోల్పోయారట.