బెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆయన శరీర భాగాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు తాజాగా వాటిని గుర్తించారు. ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నారు.. ఈ కేసుకు సంబంధించి కీలక అనుమానితుడిని నేపాల్‌లో అరెస్టు చేసిన పోలీసులు.. భారత్‌కు తీసుకువచ్చారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టిగా.. బాధితుడిగా భావిస్తోన్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి.
‘‘వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో గాలింపు జరపగా.. ఆ కాలువలో మనిషికి సంబంధించిన ఎముకలు లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపిస్తాం. ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుంది’’ అని పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ఎంపీ శరీరానికి సంబంధించినగా భావిస్తోన్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్య జరిగిన అపార్టుమెంటు సెప్టిక్ ట్యాంకులోనే గుర్తించారు. మరోవైపు, ఈ హత్య కోసం ఎంపీ సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.