పశ్చిమ బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అక్కడి రాజ్భవన్ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. వేధింపుల అంశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ‘రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ’, ‘ఆమె పోలీసులు’కు తప్ప 100 మందికి చూపిస్తామని ప్రకటనలో పేర్కొంది. ‘సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వడం లేదని పోలీసులు కల్పిత ఆరోపణలు చేశారు. వారిది చట్టవిరుద్ధమైన విచారణ. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆనంద్ బోస్ ‘సచ్ కే సామ్నే’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.’ అని బెంగాల్ రాజ్భవన్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
ఈ మేరకు రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే కావాలనుకునే వారు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా తమ అభ్యర్థనలు పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులకు మాత్రమే గురువారం ఉదయం రాజ్భవన్లో ఫుటేజీని చూడటానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పంచుకోవాలని పోలీసులు రాజ్భవన్ను కోరారు. అయితే ఈ విషయంలో పోలీసులకు సహకరించవద్దని గవర్నర్ తన సిబ్బందిని ఆదేశించారు.