బెంగళూరుకు చెందిన ఓ యువతి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడింది. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు రూ.1.36 లక్షలు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన అనేక సీసీటీవీ కెమెరాల్లో ఆ యువతి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినట్లు వీడియోలు రికార్డు అవ్వగా.. వాటి ఆధారంగా పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను, జరిమానాలను కట్టవలసిందిగా ఆమెకు వరుసగా నోటీసులు పంపారు. గతంలోను నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించామని, అయినా ప్రజల్లో మార్పు రావట్లేదని అన్నారు. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 2,681 వాహనదారుల నుంచి ఇప్పటి వరకు రూ.50,000లకు పైగా జరిమానాలను సేకరించినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.