బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు అప్పుడు కొత్త చీఫ్ వస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రానున్న వారం రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలిసింది. 19 రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించిన తర్వాత.. పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడి కోసం ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తై.. ఆయా రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. ఇక మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తే పార్టీ చీఫ్ ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ నెల చివరినాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని సమాచారం. ఏప్రిల్ చివరికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు పార్టీ పగ్గాలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.