రైళ్లలో పశువుల తరలింపులా ప్రయాణాలు సిగ్గుచేటు : హైకోర్టు

-

ముంబయి లోకల్ ట్రైన్స్ విధానంపై బాంబే హైకోర్టు తీవ్రంగా ఫైర్ అయింది. పశువులను తరలిస్తున్నట్టుగా ముంబయి రైళ్లలో ప్రయాణాలు చూసి సిగ్గు పడుతున్నట్లు వ్యాఖ్యానించింది. అధిక రద్దీతో కూడిన బోగీల నుంచి కిందపడి రైల్వే ప్రయాణికులు మరణిస్తున్న ఉదంతాలు పెరుగుతున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు విన్న ధర్మాసనం ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా పేర్కొంది.

ముంబయిలో దారుణంగా ఉన్న ఈ పరిస్థితులకు కేంద్ర, పశ్చిమ రైల్వే విభాగాల ఉన్నతాధికారులను బాధ్యులుగా చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌దారు చాలా తీవ్రమైన విషయాన్ని కోర్టు ముందుకు తెచ్చారని.. దీనికి రైల్వే అధికారులు జవాబు చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించింది. రైల్వే ప్రయాణికులను పశువుల్లా తరలిస్తున్న తీరును చేసి సిగ్గుపడుతున్నామని ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని తక్షణం సమగ్రంగా పరిశీలించి, జవాబుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, పశ్చిమ రైల్వే విభాగాల జనరల్‌ మేనేజర్లను (జీఎంలను) న్యాయమూర్తులు ఆదేశించారు. అఫిడవిట్లను జీఎంలు వ్యక్తిగతంగా పరిశీలించాలని, అలాగే ప్రమాదాల నివారణకు అందుబాటులో ఉన్న చర్యలను అందులో సూచించాలని కోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news