కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీసహా ఇతర నేతలపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు పాల్పడటంతో వారిపై కేసు నమోదయినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీతో పాటు, కె.సి.వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఎం బిశ్వశర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
మరోవైపు హస్తం నేతల చర్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశామని గువాహటి పోలీస్ కమిషనర్ దిగంత బోరా వెల్లడించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనేవారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించొద్దని షరతు విధించినా.. యాత్రలో పాల్గొన్నవారు నిర్దేశిత మార్గాన్ని అనుసరించకుండా నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నాయకులు రెచ్చగొట్టడంతో బారికేడ్లను తోసుకొని ముందుకెళ్లిన కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు.