మొన్నటిదాకా టమాట ధరలు సామాన్యులను ఠారెత్తించాయి. ఇక ఇప్పుడు ఉల్లి వంతు నడుస్తోంది. గత మూడు నెలల క్రితం రూ.20 గరిష్ఠ ధర ఉన్న ఉల్లి ఇప్పుడు ఏకంగా రూ.50కి పాకింది. దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ధరలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉల్లి ఎగుమతులపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది.
భారత్‌లో ఉల్లిని అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళ్టి నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఇందులో కొన్ని మినహాయింపులు కల్పిస్తూ.. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని డీజీఎఫ్టీ వెల్లడించింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది.