దేశవ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. అయితే తాజాగా జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర సర్కార్ స్పష్టతనిచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని పార్లమెంట్‌లో తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జమిలి ఎన్నికలపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
జమిలి ఎన్నికలతో లాభాలు ఉన్నప్పటికీ, ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదని మేఘ్వాల్ తెలిపారు. లాభాలున్నప్పటికీ అనేక అవరోధాలు కూడా ఉన్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలు జరపాలంటే కీలకమైన 5 రాజ్యాంగ సవరణలు అవసరమని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు అందుకు సమ్మతించాలని అన్నారు. జమిలి ఎన్నికలపై న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన చేసిందని.. సీఈసీ సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని.. తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందిని మేఘ్వాల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.