మయన్మార్‌ సరిహద్దులో కంచె నిర్మించనున్న కేంద్రం

-

భారత్‌, మయన్మార్‌ల సరిహద్దులోని 1,643 కిలో మీటర్ల పొడవున కంచెను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంట పూర్తిగా కంచెను నిర్మిస్తామని చెప్పారు. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల కంచె వేశామని వివరించారు. హైబ్రిడ్‌ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో కిలో మీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి అని అమిత్‌ షా సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్‌ చేశారు.

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును కలిగి ఉండగా.. ఇప్పటివరకూ సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలో మీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు ఇటీవల విపరీతంగా పెరిగిపోవడంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్‌ షా గత నెలలోనే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version