స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి అది కూడా తెలంగాణ వాసి నియమితులయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ ఛైర్మన్గా నియమించింది. ఈ బ్యాంకులో ఆయన ప్రస్తుతం సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చల్లా శ్రీనివాసులు శెట్టి తన వృత్తిజీవితాన్ని ఎస్‌బీఐలో 1988లో ఒక ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ)గా మొదలుపెట్టి.. ప్రస్తుతం ఆ బ్యాంకులోనే అత్యున్నత స్థానమైన ఛైర్మన్ స్థాయికి చేరారు.
ఇక ఎస్‌బీఐ ఎండీగా రాణా ఆశుతోష్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. 2027 జూన్ 30 (పదవీవిరమణ వయసు) వరకు ఆయన ఈ స్థానంలో కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఎస్‌బీఐకి ఒక ఛైర్మన్, నలుగురు ఎండీలు ఉండగా.. ప్రస్తుతం సింగ్ డిప్యూటీ ఎండీగా ఉన్నారు.