బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ప్లాట్ విక్రయానికి సంబంధించి.. తనను మోసం చేశారని పేర్కొంటూ ముంబయికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నవుకూ చెందిన తులసియానీ కంపెనీ ముంబయిలోని అంధేరీ ఈస్ట్ ప్రాంతానికి చెందిన కిరీట్ జస్వంత్ సాహ అనే వ్యక్తికి ప్లాటును అమ్మింది. సకాలంలో ప్లాటును తనకు ఇవ్వకుండా వేరే వారికి విక్రయించారని బాధితుడు ఫిబ్రవరి 25న పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. 2015 సంవత్సరంలో గౌరీ ఖాన్ లఖ్‌నవూకు చెందిన తులసియానీ కంపెనీని ప్రమోట్ చేశారు. లఖ్‌నవూలోని షాహిద్పాత్లో తులసియానీ కంపెనీ.. ఒక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. గౌరీ ఖాన్ ప్రకటనను చూసిన తర్వాత జస్వంత్.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిని సంప్రదించాడు. వారిద్దరూ రూ.86 లక్షలకు ప్లాటును అమ్మడానికి డీల్ ఫిక్స్ చేశారు.
2015 ఆగస్టులో ఫ్లాట్ కోసం రూ.85.46లక్షలు కట్టానని బాధితుడు చెప్పాడు. 2016 అక్టోబర్‌లో ప్లాటును రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని.. తర్వాత సరైన సమయంలో కంపెనీ ప్లాటును అప్పగించనందుకు పరిహారంగా రూ.22.70లక్షలు చెల్లించి 6నెలల్లో ప్లాటును అప్పగిస్తామని చెప్పిందని తెలిపాడు. కంపెనీ ఆ ప్లాటును వేరొకరి పేరు మీద విక్రయించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు బాధితుడికి తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.