భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు చైనా మద్దతివ్వదు! : జిన్‌పింగ్‌

-

బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ఆసక్తి చూపినట్లు మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా తెలిపారు. చైనా కూడా ఓ ఉపమంత్రిని ఉభయ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి పంపేందుకు సిద్ధమైందని.. కానీ, భారత్‌ సున్నితంగా తిరస్కరించిందని ఆ సమయంలో పాక్‌లో భారత హై కమిషనర్‌గా పని చేసిన అజయ్‌ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు.

“బాలాకోట్‌పై భారత వాయుసేన దాడుల తర్వాత భారత్‌ తొమ్మిది క్షిపణులను పాక్‌పైకి ఎక్కుపెట్టింది. వాటిని ఏ క్షణంలోనైనా ప్రయోగించే అవకాశం ఉందనే సమాచారం పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జన్‌జువాకు ఆ దేశ సైనికాధికారుల నుంచి అందింది. దాన్ని తెహ్‌మినా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ రాయబారులకు చేరవేసి వెంటనే వారి ప్రభుత్వాలకు తెలియజేసి భారత్‌కు సర్దిచెప్పాలని కోరారు. ఐరాసలో వీటో అధికారం ఉన్న ఐదు దేశాలతో పాటు భారత్‌, పాక్‌ మధ్య ఆరోజు రాత్రి పెద్ద ఎత్తున దౌత్యపరమైన కార్యక్రమాలు జరిగాయి.

ప్రధాని మోదీతో అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ఖాన్‌ చైనా సాయం కోరారని నాకు తెలిసింది. భారత్‌కు అమెరికా మద్దతిస్తున్నందున చైనా మా వెంటే ఉండాలని ఆయన కోరారు. కానీ, షీ జిన్‌పింగ్‌ దీన్ని తిరస్కరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారత్‌పైకి పాక్‌ను ఎగదోసేందుకు చైనా సహకరించబోదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని నాకు సమాచారం అందింది. భారత్‌తో అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నందున పాక్‌ నేరుగా అగ్రదేశంతోనే సంప్రదింపులు జరపాలని జిన్‌పింగ్‌ హితవు పలికారు.” అని అజయ్ బిసారియా తన పుస్తకంలో ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version