బెంగళూరుకు చెందిన ఓ మహిళా సీఈవో నాలుగేళ్ల తన కొడుకుని చంపేసి ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి గోవా నుంచి కర్ణాటకకు ట్యాక్సీలో ప్రయాణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ సాయంతో ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్‌ని స్థాపించి, సీఈవోగా వ్యవహరిస్తోంది. గత శనివారం రోజున ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని గోవాకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్ లో స్టే చేసి సోమవారం రోజున గది ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆమె వెళ్లిన తర్వాత గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
హోటల్ లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన సుచనా.. వెళ్లేటప్పుడు ఒంటరిగా కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ ను ట్రాక్ చేసి.. ఆమెకు తెలియకుండా డ్రైవర్ ను కారును సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లమని చెప్పారు. డ్రైవర్ చాకచక్యంగా పీఎస్ కు తీసుకెళ్లగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సుచనాను అరెస్టు చేశారు.