కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో బాంబు పేలుళ్లు జరగని నగరమే లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి హయాంలో ఉగ్రవాదాన్ని చూసి చూడనట్టుగా వదిలేశారని మండిపడ్డారు. రాజ్యసభలో జరుగుతున్న ఆపరేషన్ సింధూరపై చర్చ లో భాగంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి అనంతరం చర్యలపై ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారు గతంలో వారి పాలనను గుర్తు చేసుకోవాలన్నారు.
వారి హయాంలో ఢిల్లీ, వారణాసి,ముంబై, హైదరాబాద్ ఇలా ఎన్నో నగరాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి అప్పట్లో బాంబు పేలుళ్లు జరగని నగరం అనేదే లేకుండా పోయింది. వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాకిస్తాన్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. మనపై బుల్లెట్లు పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ పెట్టిందని.. ఉగ్రదాడులు చేస్తున్న వారితో వాణిజ్య సంబంధాలు పెంచుకుందని మండిపడ్డారు జేపీ నడ్డా.