ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలంతా.. సమన్వయంతో.. క్రమశిక్షణగా నడుచుకుంటూ ఐక్యతతో పని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. సమాజంలోని బలహీనవర్గాల స్థితిగతులపై సామాజిక-ఆర్థిక వివరాలపై పార్టీ నాయకులకు అవగాహన ఉండాలని సూచించారు. క
దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజున సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్థమైన వ్యూహం అవసరమని ఖర్గే అభిప్రాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ విజయాలు పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం తెచ్చాయని.. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ అలాంటి వ్యూహంతోనే.. ముందుకెళ్లి అవే ఫలితాలు రిపీట్ చేయాలని సూచించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ మహిళలకు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పిస్తూనే మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.