పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయినా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ‘ఇండియా’లోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ ప్రకటించింది. టీఎంసీకి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.
‘‘మేం తలుపులు ఇంకా మూసివేయలేదు. మొత్తం 42 స్థానాల్లో పోటీ చేస్తామని మమతా బెనర్జీ ఏకపక్షంగా ప్రకటించారు. అది వారి నిర్ణయం. మా అభిప్రాయం ప్రకారం.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. తుది ప్రకటన వచ్చే వరకు మా వైఖరి ఇదే’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.
బిహార్ రాజధాని పట్నాలో నేడు ప్రతిపక్ష పార్టీల ర్యాలీ జరగనుందని జైరాం రమేశ్ అన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలనుకునే విపక్ష పార్టీల ఐక్యతకు ఈ ర్యాలీ నిదర్శనమని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాత్కాలిక విరామమిచ్చారని వెల్లడించారు.