కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఎంతో మంది చనిపోయారు. అయితే కోవిడ్ మొదటి వేవ్ కన్నా రెండో వేవ్‌లోనే గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఐసీఎంఆర్ ఈ మేరకు ఓ అధ్యయనం చేపట్టి ఆ వివరాలను తెలియజేసింది.
కరోనా మొదటి వేవ్‌లో 0.75 శాతం మంది గర్భిణీలు, బాలింతలు కోవిడ్‌తో చనిపోగా, రెండో వేవ్‌లో ఆ రేటు 5.7 గా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. ఇక కోవిడ్ లక్షణాలు ఉన్నవారి శాతం 28.7 గా నమోదు కాగా, మొదటి వేవ్‌లో అది 14.2 శాతమే ఉంది. అయితే ముంబైలోని నాయిర్ అనే హాస్పిటల్ నుంచి మాత్రమే వివరాలను సేకరించి అధ్యయనం చేపట్టారు. మొత్తం హాస్పిటళ్లను పరిశీలిస్తే ఈ శాతం ఇంకా పెరగవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
సదరు హాస్పిటల్‌కు చెందిన 4000 మంది కోవిడ్ పాజిటివ్ మహిళల వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలను గైనకాలజీ అండ్ ఆబ్‌స్టిట్రిక్స్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. అయితే కోవిడ్ మొదటి వేవ్ కన్నా రెండో వేవ్‌లోనే గర్భిణీలు, బాలింతలు ఎందుకు ఎక్కువగా కోవిడ్ బారిన పడ్డారనే విషయం తెలియదని, ప్రస్తుతం దీనిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
కాగా ఈ అధ్యయనానికి గాను ఏప్రిల్ 1, 2020 నుంచి జనవరి 31, 2021 వరకు మొదటి వేవ్ లో, ఫిబ్రవరి 1 నుంచి మే 14వ తేదీ వరకు రెండో వేవ్‌లో డేటాను సేకరించారు. కోవిడ్ రెండో వేవ్‌లో వైరస్ ప్రభావం గర్భిణీలు, బాలింతలపై ఎక్కువగా ఉందనే మాట వాస్తవమేనని, అయితే మూడో వేవ్‌లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.