అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన ఈ అద్భుత ఘట్టానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే రామ్ మందిర్ నిర్మాణంతో అయోధ్య పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందబోతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అయోధ్య మందిరంతో పాటు అక్కడి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో దశరథ్ సమాధి స్థల్ కూడా ఒకటి.
శ్రీరాముడి తండ్రి దశరథుడు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. రామాలయం ప్రారంభమైన తర్వాత వచ్చే భక్తులకు మందిరంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా అభివృద్ధి చేపడుతున్న సర్కార్ ఇప్పుడు దశరథ్ సమాధి స్థల్ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది రామ్ మందిరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని బిల్వహరి ఘాట్ అంటారని పూజారి మహంత్ దిలీప్ దాస్ తెలిపారు. ప్రస్తుతం రామమందిరం నుంచి బిల్వహరి ఘాట్‌కు చేరుకునేందుకు నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే పార్కింగ్ కోసం కూడా స్థలాన్ని కేటాయించారు.