పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటి నుంచి ఉభయ సభల్లో గందరగోళమే నెలకొంటోంది. ఓవైపు మణిపుర్ అంశం.. మరోవైపు దిల్లీ అర్డినెన్స్ పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా విపక్షాల అభ్యంతరాల మధ్యే ‘దిల్లీ’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సోమవారం రోజున రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టిన ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై చర్చ అనంతరం.. పెద్దల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. సాంకేతిక సమస్య నేపథ్యంలో.. ఓటింగ్‌ను స్లిప్పుల ద్వారా నిర్వహించారు. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది.
అంతకుముందు సభలో షా మాట్లాడుతూ.. ఈ బిల్లు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. దిల్లీలో అవివీతి రహితమైన పాలనావ్యవస్థ తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని.. ప్రజలు హక్కులను రక్షించడానికే తాము ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు.