ఉత్తరాదిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎటుచూసిన వరదలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ముఖ్యంగా దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటల సమయానికి దిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం 203.33 మీటర్లను తాకింది. హరియాణాలోని హతిన్‌కుంద్ బ్యారేజ్ నుంచి ఈ ఉదయం యమునా నదిలోకి 2.79లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం పెరిగింది. ఈ నది నీటిమట్టం ప్రమాదకర స్థాయి 204.50 మీటర్లు. దీంతో ఏ క్షణానైనా యమునా నది ఉప్పొంగి దిల్లీకి వరదలు సంభవించే ముప్పు పొంచి ఉంది.
ఈ క్రమంలో దిల్లీ యంత్రాంగం అప్పమత్తమైంది. సెక్రటేరియట్‌లో ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీ వర్షాలు.. వరదలపై సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే 16 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. దిల్లీలో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.