దిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో ట్విస్ట్‌..!

-

రెండ్రోజుల క్రితం దిల్లీలో జరిగిన నిర్భయ తరహా గ్యాంగ్ రేప్ ఘటన గురించి విని అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత అమానుషం జరిగిందోనని బాధపడ్డారు. కానీ ఆ కేసులో యూపీ పోలీసులు ఓ సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఆ ఘటన నిజం కాదని గుర్తించారు. ఆస్తి వివాదంలో కొందరిని ఇరికించే ఉద్దేశంతో ఆమె అల్లిన కట్టుకథ అని తెలిపారు.

దిల్లీకి చెందిన 36 ఏళ్ల మహిళ ఈ నెల 16న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో సోదరుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని, ఆస్తి విషయమై మహిళపై కక్ష పెంచుకున్న ఐదుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆమెను దారుణంగా హింసించి, అనంతరం గోనె సంచిలో చుట్టి గాజియాబాద్‌ సమీపంలో రహదారిపై పడేశారని వాటి సారాంశం. దానిపై పోలీసులకు సమాచారం అందగా, వారు బాధితురాలిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని అరెస్టు చేశారు. తర్వాత వైద్యులు పరీక్షించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, అంతర్గతంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని చెప్పారు. కానీ దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ చేసిన ట్వీట్ మాత్రం ఇది నిర్భయ ఘటనను గుర్తు చేస్తోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆ రోజు ట్వీట్ చేశారు.

కానీ విచారణ అనంతరం పోలీసులు వెల్లడించిన వివరాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. ఆమె కనిపించకుండా పోయిన రెండు రోజులు తన స్నేహితుల వద్ద ఉందని పోలీసులు చెప్పారు. ‘ఆ రెండు రోజులు ఆమె తన ఇద్దరి స్నేహితుల వద్ద ఉంది. ఇక ఆమెను గుర్తించిన ఆశ్రమ్‌ రోడ్డు వద్ద ఆమె స్నేహితుల్లో ఒకరి ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్టు సిగ్నళ్లను బట్టి తేలింది. వారు తిరిగిన కారును స్వాధీనం చేసుకున్నాం. ఆమె ఫిర్యాదు అంతా అత్యాచార కేసులో వారిని ఇరికించే కుట్రగానే కనిపించింది. అలాగే ఈ కేసుకు ప్రచారం కల్పించే విధంగా డబ్బు చెల్లించిన సాక్ష్యాలను గుర్తించాం’ అని యూపీ పోలీసు ఉన్నతాధికారి ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయం కాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version