భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల నేపథ్యంలో కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ట్విట్టర్ నూతన ఐటీ నిబంధనలను పాటించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు delhi high court అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం రూపొందించిన నూతన ఐటీ నిబంధనలను ట్విట్టర్ అమలు చేయడం లేదని న్యాయవాది అమిత్ ఆచార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ… నూతన ఐటీ నిబంధనలను ట్విట్టర్ ధిక్కరించాలనుకుంటోందా? అని ప్రశ్నించింది. దీనికి ట్విట్టర్ సమాధానం ఇస్తూ… నూతన ఐటీ నిబంధనలను తాము ఇంకా అమలు చేయలేదని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినట్లు వివరణ ఇచ్చింది. ఇక ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ అధికారిని నియమించగా ఆ అధికారి రాజీనామా చేసారని, కొత్త అధికారిని నియమించాల్సి ఉందని, ఆ నియామక ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది.
ట్విట్టర్ వివరణపై అసహనానికి గురైన ధర్మాసనం… నియామక ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది? అని ప్రశ్నించింది. నచ్చినన్ని రోజులు తీసుకుంటాం అంటే కుదరదని… దీనికి న్యాయస్థానం అంగీకరించదని జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వడానికి తమకు ఒక రోజు సమయం ఇవ్వాలని ట్విట్టర్ కోరగా.. సరేనన్న న్యాయస్థానం అప్పటివరకు ట్విట్టర్‌కు రక్షణ కల్పించలేమని, కేంద్రానికి చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది.