తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌ని ఢీకొట్టడం ప్రతిపక్షాలకు సాధ్యం కాదని మొన్నటివరకు అనుకున్నారు. అప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లాగేసుకుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని విశ్లేషణలు వచ్చాయి.ఈ క్రమంలోనే బీజేపీ అనూహ్యంగా పుంజుకుని టీఆర్ఎస్‌కు ధీటుగా వచ్చింది. దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించినంత పని చేసింది. దీంతో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాలు నడిచాయి. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్(KCR) ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. అటు టీఆర్ఎస్ కూడా బీజేపీనే టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. పైగా ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకుడుని చేర్చుకున్న బీజేపీ మరింతగా తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచింది.
దీంతో మొన్నటివరకు కేసీఆర్ టార్గెట్ బీజేపీనే అనుకున్నారు. కానీ తెలంగాణ పీసీసీ పగ్గాలు రేవంత్‌కు అప్పగించడంతో రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. రేవంత్ పీసీసీగా ఎంపిక అవ్వడమే దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఓ వైపు సొంత పార్టీలోని అసంతృప్తులని బుజ్జగిస్తూనే, మరోవైపు కేసీఆర్‌పై విరుచుకుపడటం చేశారు. అలాగే తమ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన 12 మంది ఎమ్మెల్యేలని కూడా రేవంత్ టార్గెట్ చేశారు. అలా పార్టీ మారిన వాళ్ళని రాళ్ళతో కొట్టాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అటు బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని అంటున్నారు.
కేసీఆర్ మీద కేసులున్నాయని మాట్లాడుతున్న బీజేపీ నేతలు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ లేవనెత్తిన చాలా అంశాలని బీజేపీ మాట్లాడలేదు. కొత్తగా రేవంత్ రాజకీయం మొదలుపెట్టడంతో కాంగ్రెస్ పార్టీలో నూతనుత్తేజం వచ్చింది. దీంతో టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యర్ధి కాంగ్రెస్ అనే విధంగా రాజకీయం మొదలైంది. అలాగే కేసీఆర్ సైతం రేవంత్‌నే అసలు టార్గెట్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని ట్విస్ట్‌లు వస్తాయో?