సాధారణంగా శరీరానికి విటమిన్లు చాలా అవసరం. ఏ, బీ, సీ, డీ, కే విటమిన్ల కోసం అవి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తీసుకుంటుంటాం. అలాగే జింక్, ఐరన్ వంటి విటమిన్ల కోసం అవి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తింటాం. అయితే దేహానికి జింక్ అవసరమని ఎక్కడో చదివిన ఓ వ్యక్తి నాణేల్లోనూ జింక్ ఉంటుందని వాటిని మింగాడు. ఒకటి కాదు రెండు కాదు 39 కాయిన్స్ను మింగేశాడు. అంతటితో ఆగకుండా ఆ కాయిన్స్ ఎక్కడ బయటకు వస్తాయోనని అవి రాకుండా 37 అయస్కాంతాలు కూడా నోట్లో వేసేసుకున్నాడు.
దిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు కడుపునొప్పితో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరగా.. పరీక్షలు చేసిన వైద్యులు రోగి పొట్టలో రెండు, అయిదు రూపాయల నాణేలు 39, వివిధ పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను గుర్తించి అవాక్కయ్యారు. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఏడు రోజులపాటు చికిత్స అందించాక డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ తరుణ్ మిట్టల్ తెలిపారు.