మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బేలేశ్వర్ మహదేవ్ జులేలాల్ ఆలయంలో భక్తులు మెట్లబావిలో పడిపోయారు. పైకప్పు కూలడం వల్ల ఒక్కసారిగా పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి భక్తులను నిచ్చెన సాయంతో బావిలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు.
బేలేశ్వర్ మహదేవ్ ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఇందౌర్ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో రద్దీ నెలకొంది. కల్యాణ ముహూర్తం సమీపిస్తున్న సమయంలో రద్దీ మరికాస్త ఎక్కువైంది. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండలేక కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. ఎక్కువ మంది భక్తులు కూర్చోవడంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి వారంతా అందులో పడ్డారు.