ఇటీవల పొగమంచు కారణంగా దేశంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో పొగమంచు విపరీతంగా కమ్ముతూ విమాన సర్వీసులకు అంతరాయం కలిగిస్తోంది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు విమాన సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు పౌర విమానయానశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ప్రతికూల వాతావరణం కారణంగా మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేకుండా ఆలస్యం, బోర్డింగ్‌కు నిరాకరించడం వంటి సందర్భాల్లో ప్రయాణికులకు పూర్తి రక్షణ, సదుపాయాలు కల్పించాలని సూచించిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను విమానయాన సంస్థలన్నీ తక్షణమే పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా మార్గదర్శకాలు..
విమాన ఆలస్యానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని సదరు విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో వెల్లడించాలని డీజీసీఏ పేర్కొంది.
ముందస్తు సమాచారాన్ని ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్/వాట్సప్, ఈ-మెయిల్ రూపంలో తెలియజేయాలని చెప్పింది.
ప్రతికూల వాతావరణం నెలకొన్న సమయాల్లో విమానాలు 3గంటలకు మించి ఆలస్యమయ్యే సందర్భంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసేలా చూడాలని తెలిపింది.