దక్షిణ కొరియాతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కటీఫ్ అయ్యారు. ఆ దేశంతో సంప్రదింపులు జరిపే కీలక ప్రభుత్వ ఏజెన్సీలను రద్దు చేశారు. పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు కొరియాలు ఇప్పుడు తీవ్రంగా ఘర్షణ పడుతున్నాయని.. ఈ సమయంలో దక్షిణ కొరియాను దౌత్యపరమైన భాగస్వామిగా పరిగణించడం పెద్ద తప్పు అవుతుందని ఉత్తర కొరియా పార్లమెంట్ ఓ ప్రకటన జారీ చేసింది. శాంతియుత దేశ పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్లను రద్దు చేయడం సహా చర్చలు, సహకారం, సంప్రదింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకోనుంది. పార్లమెంట్ ప్రసంగంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. దక్షిణ కొరియాతో సయోధ్య కోసం ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేయబోనని తేల్చి చెప్పారు. ఆ దేశపు నంబర్ 1 శత్రువుగా గుర్తించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని పార్లమెంట్కు పిలుపునిచ్చిన కిమ్.. వచ్చే సమావేశంలో రాజ్యాంగాన్ని మార్చేయాలని ఆదేశించారు.