భారత్ ఒక దేశం కాదంటూ డీఎంకే సీనియర్ ఎంపీ ఏ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. భారత్ ఒక దేశం కాదు.. విభిన్న పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతులున్న ఒక ఉపఖండమని రాజా పేర్కొన్నారు. డీఎంకే సమావేశంలో పార్టీశ్రేణులను ఉద్దేశించిన మాట్లాడిన రాజా.. ఎన్నికల తర్వాత డీఎంకే ఉండదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు.
ఎన్నికల తర్వాత డీఎంకే లేకుండాపోతే అప్పుడు భారత్ కూడా ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి వంటి లక్షణాలు ఉంటేనే ఒక దేశం అవుతుంది. తమిళ్, మలయాళం ఒరియా వేర్వేరు జాతులు. అలాంటి జాతుల సమూహం భారత్. అని ఈ సందర్భంగా రాజా వ్యాఖ్యానించారు.
రాజా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. డీఎంకే నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయని పార్టీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవ్య మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను మరువకముందే ఆ పార్టీ ఎంపీ విభజన వాదానికి పిలుపునిచ్చారని ఆరోపించారు.