సాధారణంగా కార్పొరేట్ కార్యాలయాలంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. నియమ నిబంధనలు కచ్చితత్వంతో కఠినంగా అమలవుతూ ఉంటాయి. ప్రతీది పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఏ రకమైన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయి. ఇక సిగరెట్ స్మోకింగ్.. మద్యం సేవించడం వంటివి చేసి ఆఫీసుకు వెళ్లకూడదు. కానీ ఓ రాష్ట్రంలో మాత్రం ఆఫీసు క్యాంటీన్లలో ఏకంగా బీర్ తాగొచ్చట. ఇంతకీ ఎక్కడంటే..?
హర్యానలో ఇకపై కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లలో బీరు కూడా తాగొచ్చు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24కుగానూ రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కార్యాలయ పరిసరాల్లో ఆల్కహాల్ శాతం తక్కువ ఉన్న బీరు, వైన్ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది. జూన్ 12 నుంచి ఈ సదుపాయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయిదు వేల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు.