మ‌హారాష్ట్ర‌ను వెంటాడుతున్న విషాదాలు.. తాజాగా భూ ప్ర‌కంప‌న‌లు

మ‌హారాష్ట్ర‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌లు ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస ప్ర‌మాదాల‌తో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాజాగా.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ పరిసర ప్రాంతాల్లో వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పాల్ఘర్‌లో భూమి కంపించగా రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌ నుంచి పరుగులు తీశారు. అయితే.. ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఈ నెల 9న ఇదే ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై 3.2 తీవ్రత నమోదైంది. 11న ముంబై పరిసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో మూడు అంత‌స్తుల‌ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సోమవారం తెల్లవారుజూమున భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై భ‌వ‌నం శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాలు( ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు తెలిపాయి. భవనం శిథిలావస్థకు చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర విషాదం నెల‌కొంది.