ఎమిరేట్స్ విమానానికి పెనుప్రమాదం తప్పింది.పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అందులోని ప్యాసింజర్స్ అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన చెన్నై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం బుధవారం తెల్లవారుజామున తన గమ్యస్థానానికి బయలు దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానంలో ఇంధనాన్ని ఫిల్ చేశారు.
అయితే, విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పైలెట్ ఇంజిన్ ఆన్ చేయగా దాని లోపల నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఏం జరిగిందో పైలట్‌కు కూడా అర్థం కాలేదు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పైలెట్ ఇంజిన్ ఆఫ్ చేసి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించాడు. ఒకవేళ పైలెట్ పొగను గమనించకుండా టేకాశ్ చేసినట్లు అయితే పెనుప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 320 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.