ఆధార్‌ లింక్ కాకున్నా‘డెత్‌ క్లెయిమ్‌’లు పరిష్కరించండి.. ఈపీఎఫ్‌వో ఆదేశాలు

-

ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. ఆ క్లెయిమ్‌లను తాత్కాలిక ఉపశమనం కింద పరిశీలించాలని ప్రాంతీయ కార్యాలయాలకు అదనపు ప్రధాన కమిషనర్‌ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌లు పరిశీలించాలంటే ఆధార్‌ తప్పనిసరి. అయితే మరణించిన సభ్యుల కేసుల్లో ఆధార్‌ ధ్రువీకరణ కష్టంగా మారుతోంది. అనేక సందర్భాల్లో సభ్యుడి వివరాలు, ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. ఆధార్‌ అమల్లోకి రాకముందు చనిపోయిన సభ్యులతో పాటు కొందరికి ఆధార్‌ డీయాక్టివేట్‌ కావడం, ఇతర సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇలా ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో క్షేత్రస్థాయిలోని కార్యాలయాల్లో కాగితరూప క్లెయిమ్‌లు పరిశీలించలేకపోతున్నామని, దీంతో చందాదారులకు సకాలంలో క్లెయిమ్‌లు అందడం లేదని ఈపీఎఫ్‌వో అధికారులు కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.  ఈ విషయాలను పరిశీలించిన కేంద్ర కార్యాలయం.. ఆధార్‌ లేకున్నా నిబంధనలకు లోబడి క్లెయిమ్‌లు ప్రాసెస్‌ చేయాలని సూచించింది. వివరాలన్నీ ఈ-ఆఫీస్‌ దస్త్రం కింద ఇన్‌ఛార్జి అధికారి పరిశీలించి, నిజమైన క్లెయిమ్‌లుగా గుర్తించిన తరువాతే ప్రాసెస్‌ చేయాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news