మణిపుర్‌లో ఘర్షణలు కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నాయి. మొన్నటిదాక హింస, ఘర్షణలతో అట్టుడుకిన ఈ రాష్ట్రం ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే ఈ ఘర్షణల ప్రభావం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా పడింది. మణిపుర్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
ఇక అత్యవసరమైన ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె లీటర్ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతోంది. బియ్యం, టమాటా, ఆలుగడ్డ మొదలైన కూరగాయల ధరల్ని రూ.30 నుంచి రూ.40 వరకు పెంచటంతో సామాన్యులు కొనలేన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లను దిగ్బంధనం చేయడాన్ని విరమించుకోవాలని ఆందోళనకారులను అమిత్ షా కోరిన విషయం తెలిసిందే. మొన్నటిదాక అల్లర్ల వల్ల ఇబ్బందులు పడ్డ ఆ రాష్ట్ర జనం ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో అష్టకష్టాలు పడుతున్నారు.