ఇటీవల ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రజలు మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన మరో ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కారుపై కొండచరియలు విరిగిపడ‌్డాయి. ఈ ఘటనలో కారు ఉన్న ఐదుగురు మృతి చెందారు.
ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. రోడ్డును క్లియర్ చేసేందుకు రెస్క్యూ టీమ్ పని చేస్తోంది. చార్‌థామ్ యాత్రలో ఉన్న ఐదుగురు యాత్రికులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులు గుజరాత్‌కు చెందినట్లు అధికారులు తెలిపారు. వాళ్లంతా కేదార్‌నాథ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వివరించారు.
కేదార్‌నాథ్ హైవేపై ఉన్న కొండచరియలు విరిగిపడి.. తార్సలి వద్ద భారీ రాళ్లు కారుపై వచ్చి పడ్డాయని పోలీసులు తెలిపారు. ఆ కారు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయిందని.. ఈ క్రమంలో గుప్తకాశీ-గౌరీకుండ్ హైవేను కూడా మూసివేసినట్లు వెల్లడించారు. ఆ రూట్లో దాదాపు 60 మీటర్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని.. చౌకీ జవాది, కోత్వాలి రుద్రప్రయాగ్, చకీ తిల్‌వాడా, తానా అగస్త్యముని, కాక్‌దాగా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిందని చెప్పారు.